ఎజెండాలున్నా నిర్ణయాల్లేవ్!
హైదరాబాద్ (వివి) :
రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై ఢిల్లీలో వేడేక్కిన రాజకీయాలు..మరో పక్క బిల్లును అడ్డుకునేందుకు రాష్ట్రంలో సీమాంధ్ర నేతల ప్రయత్నాలు... ఈ నేపథ్యంలో ఆదివారం ముఖ్య మంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసిన సీమాంధ్ర నాయకుల సమావేశంలో ఏదో జరగ నుందని అందరి ఆసక్తి. అయితే ఎలాంటి సంచలన నిర్ణయాలు లేకుండానే సిఎం నిర్వహించిన సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశం ముగిసింది. ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో సిఎం రాజీనామా... కొత్త పార్టీ ఏర్పాటు, రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణ ఎజెండాగా సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశం ఆదివారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో జరిగింది. సమావేశానంతరం సిఎం నోట ఏదో కొత్త ప్రకటన వస్తుందని అందరూ
ఉహించినప్పటికీ సిఎం పదవికి రాజీనామా, పార్టీ ఏర్పాటు విషయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మంత్రులు పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి, టిజి.వెంకటేష్, పార్థసారథి, శత్రుచర్ల విజయరామరాజు, కాసు వెంకట కృష్ణారెడ్డి, ఎస్.శైలజానాథ్ పార్టీ ఎమ్మెల్యేలు గాదె వెంకటరెడ్డి, జెసి దివాకర్‌రెడ్డి, వీరశివారెడ్డి, కుతూహలమ్మ, కమలమ్మ, ఎల్లంపల్లి శ్రీనివాస్ ప్రభృతులు హాజరైనవారిలో ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఒక్కొక్కరితో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సమైక్యవాదం కోసం తామంతా సిఎం వెంట ఉన్నామని ప్రకటించిన చాలామంది సమీంధ్ర నాయకులు సమావేశానికి గైర్హాజరయ్యారు. వారిలో పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, మంత్రులు పి.బాలరాజు, ఎన్.రఘువీరారెడ్డి, కొండ్రు మురళిమోహన్, గల్లా అరుణ, సీనియర్ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది హజరుకాలేదు. తాను ఊహించిన విధంగా సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాకపోవడంతో కిరణ్‌రెడ్డి ఖంగుతిన్నారు. సీమాంధ్రలో మొత్తం 95 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఉండగా అందులో 12 మంది ఇతర పార్టీలోకి వెళ్లగా 83 మంది మిగిలారు. అయితే సమావేశానికి మాత్రం కేవలం 29 మంది ఎమ్మెల్యేలు 7గురు మంత్రులు, 8 మంది ఎమ్మెల్సీలు మాత్రమే హాజరు అయ్యారు. హజరైనవారితో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశం నిర్వహించారు. కొంతమంది సిఎం పదవికి రాజీనామా చేయాలని, మరికొంతమంది కాంగ్రెసు పార్టీలో కొనసాగుతూనే అవసరమైతే విభజనపై న్యాయపోరాటం చేస్తామని సూచించారు. మరికొంత మంది ఈనెల 21 వరకు వేచి చూడాలని, ఇంకొంత మంది పార్టీ పెట్టి కాంగ్రెసుకు గుణపాఠం చెప్పాలని సూచినట్లు తెలిసింది. పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ఆమోదముద్ర పడితే అదే రోజు రాజీనామాస్త్రాన్ని సంధించాలని కొందరు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి సూచించినట్టు తెలిసింది. అయితే మరి కొందరు మాత్రం రాజీనామా చేయడం అంత మంచిది కాదని తెలిపారు. టి-బిల్లును అడ్డుకునేందుకు వ్యూహరచనలు చేయాలని, అందుకు మరి కొన్ని పార్టీల మద్దతు పొందాలని ఇదే తమ ముఖ్య లక్ష్యంగా పని చేస్తే బాగుంటుందని ఇంకొందరు ఎమ్మెల్యేలు కిరణ్‌కుమార్ రెడ్డికి సూచించినట్టు సమాచారం. ఒక వేళ అప్పటికీ 'టీ' ఆగకపోతే ముక్కుమ్మడిగా రాజీనామాస్త్రాన్ని సంధిస్తే తీవ్ర ప్రభావం ఉంటుందని, స్థానికంగా ప్రజామద్దతు కూడ గట్టుకునేందుకు కూడా అవకావశం లేకపోలేదని కొందరు పేర్కొన్నారు. ప్రస్తుత తాజా రాజకీయాల నేపథ్యంలో కొత్త పార్టీని తెరమీదకు తీసుకొస్తే ఎలా ఉంటుందనే విషయమై కూడా వారు విస్తృతంగా చర్చించారు. ఇందుకు కొందరు సుముఖత చూపగా మరికొందరు ఇప్పట్లో 'కొత్త' ప్రయోగాలు చేయరాదని సూచించినట్టు సమాచారం. పైగా కొందరు సీమాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులు టిడిపి, బిజెపిలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్న విషయమై కూడా వారు చర్చించినట్టు తెలుస్తోంది. సగం మంది మాత్రమే సమావేశానికి రావడం, అందులోను బిన్న అభిప్రాయాలు వ్యక్తం కావడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. అవసరమైతే సీమాంధ్రలో 10 రోజుల పాటు పర్యటించి జనం నాడిని బట్టి కొత్తపార్టీపై నిర్ణయం తీసుకోవాలని కిరణ్‌కుమార్‌రెడ్డి అలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మంత్రులు టిజి.వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ సీమాంధ్రలో కొత్త పార్టీ అవసరముందని, తాము మాత్రం కాంగ్రెసును వీడడం ఖాయమన్నారు. అయితే సిఎం కొత్త పార్టీ పెడితే అందులో చేరుతామని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. తమ నియోజకవర్గాల ప్రజలు, కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే స్వతంత్రంగా పోటీ చేస్తామన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. సిఎం రాజీనామా చేయడం, కొత్త పార్టీ పెట్టడం ఖాయమని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టగానే సిఎం రాజీనామా చేసే అవకాశం ఉందని ఎమ్మెల్యే వీరాశివారెడ్డి అన్నారు. ఈ నెల 18న సిఎం రాజీనామా, అసెంబ్లీ రద్దుకు అవకాశం లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పనిసరి అయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. కాగా సిఎం కొత్త పార్టీ పెట్టే ఆలోచన గురించి తనకు చెప్పలేదని మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. ముఖ్యమంత్రి తన రాజీనామా అంశంపై మంగళవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పితాని సత్యనారాయణ చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుతో తాము ఇక పార్టీలో కొనసాగలేమని కొందరు ఎమ్మెల్యేలు వాపోయారని ఆయన తెలిపారు. ఇదిలావుండగా రాష్ట్ర విభజన బిల్లుపై పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం సాయంత్రం ఢిల్లీలో సీమాంద్ర ఎంపీల సమావేశం ఉండడంతో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఆదివారం ఉదయమే క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్ తదితరులు పాల్గొన్నారు. బిల్లును అడ్డుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహం కాంగ్రెస్ ఎంపీల పాత్ర.. ఇతర పార్టీ ఎంపీల మద్దతు కూడగట్టడం, ఎంపీల సస్సెన్షన్ ఎత్తివేతకై ఒత్తిడి తదితర అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం. అనంతరం ఎంపీలు ఢిల్లీకి వెళ్లారు.
సీమాంధ్ర నాయకులలోనే 'విభజన'
రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నిర్వహించిన సమావేశంలోనే నాయకుల విభజన కనిపించింది. సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ముఖ్యమంత్రి కిరణ్‌తోనే ఉన్నారనే ప్రచారం పెద్దఎత్తున సాగిన విషయం తెలిసిందే. తాజా సమావేశంతో సీమాంధ్ర నాయకుల్లో కూడా ఐక్యత లేదని స్పష్టమైంది. దాదాపు 83 మంది ఎమ్మెల్యేల్లో కేవలం మంత్రులతో కలిపి 36 మంది మాత్రమే హాజరు కావడం ఇందుకు నిదర్శనం. మరో పక్క సిఎం సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ఆరా తీసినట్టు సమాచారం. ఇక్కడి తాజా సమాచారాన్ని ఢిల్లీకి చేరవేస్తున్నట్టు కూడా తెలిసింది.
No comments:
Post a Comment